హెచ్-1బీ వేతనాలపై కీలక ప్రతిపాదన.. భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం.. అమెరికాలో ఉద్యోగం ఇక కష్టమే?

  • హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న అమెరికా
  • కనీస వేతనాన్ని 30 శాతం పెంచాలని కార్మిక శాఖ ప్రతిపాదన
  • స్థానిక అమెరికన్ల ప్రయోజనాలే లక్ష్యంగా కొత్త నిబంధనలు
  • భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
  • గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలపై కూడా ఆర్థిక భారం
అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ వర్గాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విదేశీ నిపుణులకు చెల్లించాల్సిన కనీస వేతనాన్ని ఏకంగా 30 శాతం వరకు పెంచాలని యూఎస్ కార్మిక శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్) ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారం పడటంతో పాటు అక్కడ ఉద్యోగాలు ఆశిస్తున్న భారతీయుల కలలకు గండిపడే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకీ కఠిన నిర్ణయం?
ప్రస్తుతం అమలులో ఉన్న హెచ్-1బీ వేతన స్కేలును సుమారు రెండు దశాబ్దాల క్రితం నిర్ణయించారు. దీనివల్ల కంపెనీలు తక్కువ జీతాలకే విదేశీ నిపుణులను నియమించుకుంటూ, స్థానిక అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. తక్కువ వేతనానికి విదేశీయులు దొరుకుతుండటంతో అమెరికన్లకు ఉపాధి లేకుండా పోతోందని, వారి ప్రయోజనాలను కాపాడటానికే ఈ కొత్త వేతనాల పెంపు ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు కార్మిక శాఖ వివరిస్తోంది. ఈ మార్పు ద్వారా అమెరికన్లకు, విదేశీ నిపుణులకు మధ్య ఉన్న జీతాల వ్యత్యాసాన్ని తగ్గించి, సమాన అవకాశాలు కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.

భారీగా పెరగనున్న జీతాలు
కొత్త ప్రతిపాదనల ప్రకారం నాలుగు స్థాయిలలోని ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరగనున్నాయి.
లెవెల్ 1 (ఎంట్రీ లెవెల్): ప్రస్తుతం ఉన్న 73,279 డాలర్ల నుంచి 97,746 డాలర్లకు (సుమారు 33.39% పెంపు) పెరుగుతుంది.
లెవెల్ 2: ప్రస్తుతమున్న 98,987 డాలర్ల నుంచి 1,23,212 డాలర్లకు (24.47% పెంపు) చేరుతుంది.
లెవెల్ 3: 1,21,979 డాలర్ల నుంచి 1,47,333 డాలర్లకు (20.79% పెంపు) పెరుగుతుంది.
లెవెల్ 4 (అత్యధిక అనుభవం): ప్రస్తుతమున్న 1,44,202 డాలర్ల నుంచి ఏకంగా 1,75,464 డాలర్లకు (21.68% పెంపు) చేరుతుంది.

ఈ మార్పులు కేవలం హెచ్-1బీ వీసాలకే పరిమితం కాదు. H-1బీ1, ఈ3 వీసాలతో పాటు పీఈఆర్ఎమ్ లేబర్ సర్టిఫికేషన్ కార్యక్రమాలకు కూడా వర్తిస్తాయి. దీనివల్ల గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలతో పాటు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ ఐటీ కంపెనీలపై కూడా తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలు ఇంతటి భారీ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం దాదాపు అసాధ్యంగా మారవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గతంలో 2020లో కూడా ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నమే చేసింది. అయితే, ప్రజాభిప్రాయ సేకరణను సరిగ్గా చేపట్టకపోవడంతో ఆ ప్రతిపాదన చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొని వీగిపోయింది. ఈసారి మాత్రం ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఈ నెల‌ 26 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను, సూచనలను స్వీకరించి, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది. గతేడాది విదేశీ అభ్యర్థుల నుంచి 1,00,000 డాలర్ల ఫీజు వసూలు చేయాలనే నిబంధన వచ్చిన నేపథ్యంలో తాజా వేతనాల పెంపు ప్రతిపాదన విదేశీ నిపుణులకు మరింత ఆందోళన కలిగిస్తోంది.

H-1B Visa
Indian IT Professionals
US Department of Labor
H-1B Wage Hike
USA Jobs
IT Companies
Minimum Wage
Trump Administration
Infosys
TCS

More Telugu News